శ్రీ సీతారామస్వామి కొలువైన....భద్రాచల ఆలయము చరిత్ర
అయోధ్య రాముడు, కోదండ రాముడు అంటు శ్రీరాముడిని హిందువులు ఎంతో భక్తితో పిలుచుకుంటారు. శ్రీరాముడిని శ్రీ విష్ణువు రూపంగా భావిస్తారు. ఆయన మనిషి రూపంలో భూమ్మీద జన్మించిన అవతార పురుషుడిగా నమ్ముతారు. మనిషి నిజాయితీగా ధర్మంతో ఎలా మెలగాలో ఆచరించి చూపించిన వ్యక్తిగా శ్రీరాముని కొలుస్తారు. అంతటి మహనీయుడు స్వయంగా వెలసిన పుణ్యక్షేత్రమె మన భద్రాచలం. భద్రాచలంలో శ్రీరాముడి ఆలయాన్ని దక్షిణ అయోధ్య అని పిలుస్తారు.
భద్రాచలం స్థల పురాణము
భద్రాచలాన్ని మొదట్లో భద్రగిరిగా పిలిచేవారు. ఈ భద్రగిరి చరిత్ర ప్రారంభం అయింది రామాయణ కాలంలోనే. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడే గడిపారని, ఇక్కడే బంగారు లేడీని చూడడం, ఇక్కడే మారీచుని చంపడం, రావణుడు సీతను ఎత్తుకుపోవడం ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న పర్ణశాలలోనే జరిగాయని చెబుతారు. ఈ ఆలయ ప్రాంతం నుంచి శ్రీరాముడు గోదావరి నదిని దాటారు అని అంటారు. శ్రీరాముడు శ్రీలంక లో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో ఉన్న గోదావరి నదిని ఇక్కడే భద్రాచలం వద్ద దాటారు.
భద్రాచలం పేరు వెనుక ఉన్న రహస్యము
సీతను రావణుడు అపహరించుకొని వెళ్ళిపోయాక శ్రీరాముడు వేదనతో సీతను వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భద్రుడు శ్రీరామునికి సహాయం చేయదలుచుకొని భావించి అందులో భాగంగానే తమ ప్రాంతంలోని పర్వతంపై నివాసం ఉండమని కోరుతారు. అందుకు శ్రీరాముడు సీత జాడను కనుగొని తీసుకొని వచ్చేటప్పుడు తప్పకుండా ఈ ప్రాంతం పై నివాసం ఏర్పరచుకుంటానని భద్రుడుకీ ఆ క్షణము మాట ఇచ్చి రాముడు సీత కోసం వెతికేందుకు ముందుకు వెళతారు. ఇక భద్రుడు అప్పటినుంచి రాముని రాక కోసం తపస్సు చేస్తూ ఉంటారు. కానీ, శ్రీ రాముడు భద్రుడుకి ఇచ్చిన మాటను మర్చిపోతారు. తర్వాత సీత దొరికిన అనంతరం ఆయన రాముని అవతారం పూర్తి కావడంతో తిరిగి వైకుంఠనికి వెళ్లి విష్ణువు రూపంలో ఉంటారు. భద్రుడికి ఈ విషయం తెలియక తపస్సు కొనసాగిస్తూనే ఉంటారు. దాంతో వైకుంఠం వెళ్లిన స్వామికి భద్రుడీ కోరిక గుర్తుకు వచ్చి హడావిడిగా భూలోకానికి బయలుదేరుతారు. అయితే విష్ణుమూర్తి అలవాటు ప్రకారం తన చేతిలోకి శంకు, చక్రాలు తీసుకుంటారు. కానీ తొందర్లో అవి తారుమారై అయిపోతాయి. కుడి చేతిలో ఉండవలసిన సుదర్శన చక్రం ఎడమ చేతికి, ఎడమ చేతిలో ఉండవలసిన శంకు కుడి చేతికి మారాయి. భద్రుడు కోరుకున్నది రామావతారం కాబట్టి విల్లును కూడా తీసుకున్నారు. అయితే రాముని అవతారంలో ఆయనకి రెండె చేతులు. కానీ, వైకుంఠం వెళ్లిన తర్వాత ఆయన విష్ణువు కాబట్టి నాలుగు చేతులు ఉంటాయి. అక్కడి నుంచి భద్రుడి కోసం వచ్చినప్పుడు కూడా అలానే నాలుగు చేతులతోనే వస్తారు. ఇక అలా విష్ణుమూర్తి కాస్త రాముడి అవతారంలో, తన భార్య శ్రీలక్ష్మి దేవి ని కాస్త సీతగా, ఇక శేషుడిని కాస్త లక్ష్మణుడి రూపంలోకి మార్చి ఆయనతో పాటు వెంటపెట్టుకొని భద్రుడి ముందు ప్రత్యక్షమవుతారు. వారిని చూసిన భద్రుడు ఎంతో ఆనందిస్తారు. అప్పుడు శ్రీరాముడు భద్రుడిని "ఏమి వరము కావాలో కోరుకోమని" అడుగుతారు. అప్పుడు భద్రుడు "తన శిరస్సుపై నివాసం ఉండమని" కోరుకుంటారు. అప్పుడు శ్రీ రాముడు కూడా పంచభూతాలు ఉన్నంతకాలం భద్రునిపై తాను సీతా, లక్ష్మణ సమేతంగా విరజిల్లుతానని తనతో పాటు భద్రుడిని దర్శించుకున్న వారికి శుభాలు కలుగుతాయని వరాన్ని ఇస్తారు. అలా శ్రీరామచంద్రుడు భద్రుడి శిరస్సుపై అంటే భద్రగిరి కొండపై స్థిరనివాసం ఏర్పరచుకొని రామభద్రుడు అయ్యారు. అలా రాముడిని తలపై మోస్తూ భద్రుడు భద్రాచలం అయ్యారు.
భద్రాచలంలో ఉన్న ఆలయాన్ని నిర్మించడం
పురాణాల ప్రకారం 17వ శతాబ్దంలో భద్రాచలం సమీపంలో భద్రిరెడ్డి పాలెం అనే ఒక గ్రామం ఉండేది. ఈ గ్రామంలో పోకల ధమ్మక్క అనే మహిళ శ్రీరాముని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉండేది. ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించి "తాను భద్రగిరి పై ఉన్నానని, తనను మిగిలిన భక్తులు కూడా దర్శించుకునేలా చేయమని, ఈ విషయంలో తనకు ఇంకొక భక్తుడు సహాయం చేస్తారని" కలలో శ్రీరాముడు ధమ్మక్కతో చెప్పినట్టు ఆమెకు కల వచ్చింది. దీంతో ధమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం చెప్పి అందర్నీ వెంటపెట్టుకొని భద్రగిరి పైకి కలలో శ్రీరాముడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళింది. కలలో శ్రీరాముడు చెప్పినట్లుగానే అక్కడ శ్రీరాముడు వెలసిన విగ్రహాలతో ఉన్న ఆ ప్రాంతాన్ని గుర్తించారు. ఇక ఆ విగ్రహాలకు ధమ్మక్క పందిరి వేసి రోజు పూజ చేసి పండ్లను నైవేద్యంగా పెడుతూ వచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం ఇక్కడ నిర్వహించడం మొదలైందని మన పురాణాలు చెబుతున్నాయి.
ఇక ఆ తర్వాత రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న అనే వ్యక్తి భద్రాచలంలో శ్రీరాముడికి ఎలాగైనా గొప్ప ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయము ఇప్పుడు భద్రాచలంలో ఉన్నది.
ఈ ఆలయము నిర్మాణము వెనుక ఉన్న కధ
కంచర్ల గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేల కొండపల్లి అనే ఒక గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేసే అక్కన్న, మాదన్న లకు ఈ గోపన్న వరసకి మేనల్లుడు అవుతారు. అయితే ఈ గోపన్న తన మేనమామల సహాయంతో నేలకొండపల్లి పరిసర ప్రాంతములో తహసిల్దార్ గా పదవి బాధ్యతలను చేపట్టారు. ఇలా ఈయన పదవిలో ఉన్నప్పుడే భద్రాచలంలో వెలసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న గోపన్న ఆయనకు పరమ భక్తుడిగా మారిపోయారు. అయితే విగ్రహం రూపంలో వెలసిన భద్రాచలము రాముడికి అక్కడ సరియైన ఆలయం లేదని చాలా బాధపడ్డారు. ఏదో ఒకటి చేసి ఆలయాన్ని కట్టాలని భావించి అప్పుడు ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన ప్రభుత్వ డబ్బు ఆరు లక్షల రూపాయలని ప్రభుత్వానికి చేర్చకుండా రహస్యంగా ఖర్చుపెట్టి భద్రాచల శ్రీరాముడి ఆలయాన్ని 1674లో కట్టించారు. అయితే ప్రభుత్వం డబ్బులను నవాబుకు చెప్పకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ, ఈ విషయం నవాబు తనిషాకు ఆ తర్వాత తెలియడంతో ఆయనకు విపరీతమైన కోపము వచ్చింది. దాంతో వెంటనే ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బుని ఇవ్వాలని ఉత్తరం ఇచ్చారు. అయితే తన దగ్గర డబ్బులు లేవని, వాటితో శ్రీరాముడికి గుడి కట్టించానని గోపన్న చెప్పారు. దీంతో తానీషా గోపన్నను గోల్కొండ కి రప్పించి జైలులో బంధించారు. ఇలా 12 సంవత్సరాల పాటు గోపన్న ఆ జైలులోనే ఉండి ఎన్నో కష్టాలు అనుభవించారు. బందీ కానాలో ఉంటూ రోజు భద్రాచల శ్రీరాముడిని తలుచుకుంటూ ఎన్నో కీర్తనలు రాశారు. అవి నేటికీ చాలా ప్రత్యేకమైనవే.
గోపన్నని అందరూ రామదాసుగా పిలుస్తారు. ఈయన ఆ సమయంలో రాసిన కీర్తనలే నేటికీ రామదాసు కీర్తనలుగా అందరూ వింటున్నారు. అయితే గోపన్న ప్రార్థనలు ఆలకించిన శ్రీ రాముడు అతనికి జైలు నుంచి విమోచనం కల్పించాలి అని భావించి, శ్రీరాముడు లక్ష్మణుడు తో కలిసి తమ వేషధారణలు మార్చుకొని తానిషా నవాబు దగ్గరికి వెళ్లి గోపన్న చేసిన అప్పుని డబ్బు రూపంలో చెల్లించి ఆ నవాబు దగ్గరి నుంచి అప్పు తీర్చినట్లుగా రసీదు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత వారు ఆ రసీదును గోపన్న తల దగ్గర పెట్టి మాయమైపోతారు. తర్వాత రోజు నవాబు గోపన్నను జైలు నుంచి విడిపించి జరిగిన విషయం అంతా తెలుసుకొని శ్రీరాముడు, లక్ష్మణుడు ఇలా వచ్చారని గ్రహించి వారిని ఇచ్చిన డబ్బు ఆరు లక్షల మొహరీలు కూడా గోపన్నకి ఇచ్చేస్తారు. కానీ, రామదాసు వాటిని స్వీకరించకుండా శ్రీరాముని గుర్తుగా రెండు మొహరీలు మాత్రమే తీసుకుంటారు. అవి ఇప్పటికీ ఆలయంలోనే ఉన్నాయి.
1960 నాటికి రామదాసు కట్టించిన ఆలయం శిథిలమయింది. ఆ కాలంలో కల్లూరి చంద్రమౌళి అనే వ్యక్తి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా నిర్వహించబడ్డారు. ఆయన గుడి పునఃనిర్మాణనికి పూనుకున్నారు. రాష్ట్రం అంతట తిరిగి లక్షల రూపాయలు విరాళాలు పోగు చేసి, ఆలయాన్ని పునఃనిర్మించారు. ఈ క్రమంలోనే 500 శిల్పులతోనే అద్భుతంగా కళ్యాణ మండపము నిర్మించారు.
రామాలయానికి దక్షిణ వైపు ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యాన మందిరాన్ని కట్టించారు. అందమైన శిల్పాలతో, గోపురాలు ఆరు అడుగుల పచ్చ రాయితో రామదాసు విగ్రహాన్ని ప్రతిష్టించారు. రామదాసు కీర్తనలు, భక్తి తరతరాలకు తెలియాలని ఉద్దేశంతో తిరిగి ఆలయాన్ని పునఃనిర్మించారు.
నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయానికి వేలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు. పవిత్రమైన గోదావరి నది ఈ భద్రాద్రి కొండని చుట్టుకుని దక్షిణ దిశ వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది.
భద్రాచలం శ్రీ రాముని కళ్యాణం
స్వామివారి కల్యాణానికి ఏనుగు మీద ప్రత్యేక అధికారితో ముత్యాల తలంబ్రాలను ప్రతి ఏటా పంపించేవారు. అలా అప్పటి తానీషా నవాబు మొదలుపెట్టిన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని వస్తారు. ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణము. ఈ కళ్యాణము దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందినది. ఉత్సవము ప్రతి సంవత్సరము జరిగే ఈ కళ్యాణానికి అనేక లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి పంపడం జరుగుతుంది.
భద్రాచలం లో ఉన్న విశేషాలు
- భద్రాచలం ఆలయంలో శ్రీ రాముడు కొలువైన గర్భగుడి పై ఉన్న శిఖరాన్ని ఏకశిలపై చెక్కారు. ఈ రాయి బరువు 36 టన్నులు. ఇంత బరువు ఉన్న ఈ రాయిని ఎటువంటి ఆధునిక పరికరాలు లేని ఆ కాలంలో అంత పైకి ఎలా చేర్చారో అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం.
- మామూలుగా శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపాన్ని పోలి ఉంటుంది. కానీ, భద్రాచలంలో ఆలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో ఉంటుంది. కుడి చేతిలో బాణమును, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు లాగా కుడి చేతిలో శంఖమును, ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటారు.
- ఇతర దేవాలయాలలో సీతదేవి రాముని పక్కన నిలుచోని ఉంటుంది. కానీ, ఈ ఆలయంలో రాముని ఎడమ తొడపై కూర్చొని ఉంటుంది. మిగిలిన ఆలయాలలో ఇద్దరికీ రెండు పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరికీ కలిపి ఒకే పీఠ ఉంటుంది. రాముడికి సంబంధించిన అన్ని దేవాలయాలలో లక్ష్మణుడికి రాముడు కుడివైపున ఉంటారు. కానీ, ఇక్కడ మాత్రం ఎడమ వైపున కనిపిస్తారు.
- శ్రీ రాముడి గర్భ గుడి పై ఉన్న చక్రాన్ని ఎవరు తయారు చేయలేదు. ఆ గుడి కడుతున్న సమయంలో భక్త రామదాసు అక్కడ గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ నది ప్రవాహంలో కొట్టుకు వచ్చి రామదాసు చేతిలో ఆ చక్రం పడిండి. అది రాములవారు అనుగ్రహించారు అని భావించిన రామదాసు ఆ చక్రాన్ని తీసుకొచ్చి గర్భగుడి గోపురం పై ప్రతిష్టించారు.
- తన భక్తుడైన రామదాసును విడిపించడానికి శ్రీ రాముడు ఆయన కాలము నాటి శ్రీరామ టెంకలు అంటే నాణ్యాల రూపంలో ఆరు లక్షల రూపాయలను చెల్లించారు. దీన్నిబట్టి గుడి ఖర్చు, ఆభరణాల ఖర్చు రాములవారె స్వయంగా చెల్లించారు అని అర్థమవుతుంది. ఇప్పటికీ ఆ నాణ్యాలు గుడి మ్యూజియంలో ఉన్నాయి.
- రాముల వారి కళ్యాణము లో వాడే మంగళ సూత్రాలు 16వ శతాబ్దంలో భక్త రామదాసు చేయించారు. అప్పుడు ఆయన చేయించిన మంగళసూత్రలు, మిగిలిన ఆభరణాలని ఇప్పటికీ వాడుతున్నారు.
- భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలలో శ్రీరామునిపై వేసే కోటి తలంబ్రాలను చేతులతో తయారుచేస్తారు. అంటే తలంబ్రాలకు అవసరమయ్యే బియ్యం కోసం వడ్ల గింజల్ని దంచడమో లేదా మిషన్లపై ఆడించడం చేయకుండా ఒక్కొక్క వడ్ల గింజ పై పొట్టును భక్తులే చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటి తలంబ్రాలుగా చేస్తారు.
- రాముల వారి కళ్యాణం లో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేకత స్థానము ఉంది. భక్త రామదాసు వల్ల అప్పటి రాజు తానీషాకి కలలో శ్రీరాముడు దర్శనం ఇవ్వడం వలన ఆనందం చెందిన తానిషా ముత్యాల తలంబ్రాలను రాములవారికి కళ్యాణం లో సమర్పించే ఒక శాసనం కూడా తయారు చేయించారు. ఈ శాసనం ప్రకారం స్వామివారి కళ్యాణంలో ఉపయోగించే ముత్యాలు తలంబ్రాలు పాలకొల్లు చేతుల మీదుగానే రావాలని రాసి ఉంది. అందుకే ఇప్పటికి ఆ సాంప్రదాయాన్ని మన ప్రభుత్వలు పాటిస్తున్నాయి.
- రామదాసును బంధించిన చెరసాలలో నిత్యము రాములవారికి పూజలు చేసుకోవడానికి అక్కడి గోడలపై రామదాసు స్వయంగా తన చేతులతో సీతారాములు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి విగ్రహాలను చెక్కారు. ఇప్పటికీ ఆ బొమ్మలను గోల్కొండ కోటలోని రామదాసు చెరసాలలో చూడవచ్చు.
- రామదాసు చరిత్ర కథ కాదని యదార్ధమని నిరూపించడానికి ప్రధాన సాక్ష్యం భద్రాద్రి ఆలయం అయితే రెండవ సాక్ష్యం గోల్కొండలోని రామదాసు చెరసాల అని చెప్పవచ్చు.
- భద్రాచలం శ్రీ రాముడి గురించి బ్రహ్మ దేవుడి ద్వారా తెలుసుకున్న నారదుడు తాను భూలోకంలో సంచరించినప్పుడు ఎక్కువ సమయం ఇక్కడే ఉండి శ్రీరామ నామాని గానము చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు బోధించారాని అప్పటి పురాణాలో చెప్పబడింది.
- కబీర్ దాసు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయనని దైవదర్శనానికి అనుమతించలేదు. అప్పుడు స్వామివారి విగ్రహాలు మాయమైపోయాయి. కబీర్ దాస్ ను లోపలికి దర్శనానికి అనుమతించిన తర్వాతనే మళ్లీ ఆ విగ్రహాలు అందరికీ కనిపించాయట.