లేపాక్షి ఆలయ రహస్యలు...
అనంతపురము జిల్లా హిందూపురానికి సమీపము లో లేపాక్షి మండలంలో కొండమీద వీరభద్రస్వామి వారి ఆలయము ఉంది. ఇది చాలా ప్రాచీనమైన ఆలయము. ఈ ఆలయము వీరభద్రేశ్వర ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శ్రీరాముడి చేతుల మీదుగా ప్రతిష్ట చెందినట్టు చెప్పబడే శ్రీ రామేశ్వర స్వామి శివలింగము, ఆంజనేయుడు ప్రతిష్టించినట్లు చెప్పబడే హనుమలింగము, స్వయంభుగా వెలసినది అని చెప్పబడే పాప నాస్వేశ్వర లింగము.మొదలగు శివలింగ మూర్తులు వెలసిన గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగెత్తుతున్నది ఈ ఆలయము. 108 శైవ క్షేత్రాలలో లేపాక్షి ఒకటి అని స్కంద పురాణము వల్ల తెలుస్తున్నది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు అచ్యుత దేవరాయల వారి కాలములో వారి వద్ద కోశాధి అధికారిగా ఉన్న విరూపాన్న కట్టించారని తెలుస్తున్నది.
ముందుగా ఇక్కడ వెలసిన గణపతిని దర్శించిన తర్వాతనే వీరభద్రుడిని దర్శించి పూజిస్తారు. ఈ ఆలయము అలనాటి విజయనగర సామ్రాజ్య కళాకారుల చేతులతో అత్యంత సుందరంగా నిర్మించబడింది. ఈ ఆలయము నందు పాప నాస్వేశ్వర స్వామి, కోదండ రామస్వామి, వీరభద్రేశ్వర స్వామి ప్రతిష్టించబడి ఉన్నారు. ఈ ఆలయములో పానవట్టము మీద శ్రీరాముడు ప్రతిష్టించబడి ఉంది. ఈ ఆలయంలోనే తప్ప మరొకచోట లేదని తెలుస్తుంది. పవిత్ర మూర్తులు అయినా శ్రీరాముడు, వీరభద్రుడు, దుర్గాదేవి, పాప నాస్వేశ్వరులని కలిపి ఆరాధించేలా ఇది ఒక్కటే అని చెప్పక తప్పదు. లేపాక్షి వీరభద్ర ఆలయము సమీపంలో 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు గల బ్రహ్మాండమైన నందీశ్వరుడిని ఏకశిలా విగ్రహము ఎంతో అందంగా కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయానికి దగ్గరలో ఒక పురాతమైన శివాలయము ఉంది. ఈ ఆలయంలో దాదాపు 30 అడుగుల ఎత్తు గల ఏడు శిరస్సుల నాగేంద్రుడు చుట్టుకొని ఉన్నట్టు మధ్యలో శివలింగము ఉంటుంది. చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఉన్న పాప నాస్వేశ్వర స్వామి ఆగస్థ్య మహర్షి పై చేతులతో ప్రతిష్టించబడి ఉంది. ఒకరికి ఎదురుగా మరొకరిగా పాప నాస్వేశ్వరడు అంటే శివుడు రఘునాథమూర్తి అంటే విష్ణు ఉండి శివకేశవులకు బేధము లేదని చక్కటి మత సామ్రాస్యాన్ని ప్రదర్శించుట.
లేపాక్షి స్థల పురాణము
ఈ ఆలయము మరొక ప్రత్యేకత సీతమ్మవారిని అపహరించుకొని పోతున్న రావణుడితో జటాయువు అనే పక్షి యుద్ధము చేయగా రావణాసురుడు దాన్ని రెండు ముక్కలు తెగ నరికారు. చివరి వరకు వీరోచితంగా పోరాడిన ఆ పక్షిరాజు నేల కూలింది. రాముడికి ఈ విషయము తెలిసే వరకు తనకు మరణము రాకూడదని కోరుకుంది. సీత అన్వేషలో రాముడు అటువైపుగా వచ్చి జటాయువుని కలిసి ఈ విషయము తెలుసుకున్నారు. సీతను రావణుడు అపహరించుకొని పోయాడని జరిగిన విషయము అంతా చెప్పి తుది శ్వాస విడిచింది. కృతజ్ఞతతో శ్రీరాముడు లే పక్షి అని దీవిస్తూ ఆ పక్షి కి దహన సంస్కారాలు చేసి మోక్షము ప్రసాదించిన స్థలము ఇది. అందువల్లనే ఇది లేపాక్షి అయిందని ఒక కథనము కూడా ఉంది. శ్రీరాముడి పాద స్పర్శతో పునీతము అయిన ఈ ప్రదేశాన్ని భక్తులు దర్శించి ధన్యులు అవుతారు.
లేపాక్షి ఆలయము చరిత్ర
విజయనగర చక్రవర్తి అయిన అచ్యుత దేవరాయలు వారి ఆస్థానంలో ఖజానాకు అధికారిగా విరూపాన్న అనే వ్యక్తి ఉండేవారు. అతని సోదరులు వీరన్న ఇద్దరూ లేపాక్షి ప్రసిది విని ఇక్కడే ఉంది దేవాలయాన్ని పునః నిర్మించారు. అందులో తమ కుల దైవము అయినా వీరభద్రుడిని ప్రతిష్టించారు. దేవాలయము నిర్మాణానికి అయ్యి రాజు గారి ఖజానాని అంతా విరూపాన్న వాడేసాడని ఆరోపణలపై అతనికి కన్నులు పొడిచి వెయ్యవలసింది అని రాజుగారు ఆదేపించారు. ఈ వార్త విన్న విరూపాన్న మనస్థాపము చెంది తన రెండు కనుగుడ్లను తనే తొలగించుకొని గోడకేసి కొట్టుకున్నారు. గోడపై రెండు గుంటలు పక్కనే ఎర్ర నెత్తురు మరకలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ వార్త విన్న మహారాజు చాలా బాధపడి స్వామిని క్షమాబిచ్చ కోరారు. ఆ విధంగా లేపాక్షి ఆలయము నిర్మాణము అసంపూర్తిగా ఆగిపోయింది.
లేపాక్షి ఆలయములో ఉండే స్తంబాల ప్రత్యేకతలు
లేపాక్షి ఆలయము శిల్పాలకు చిత్రాలకు కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో మరి ఎక్కడా కానరాని ముఖ్య ఆకర్షణ అంతరిక్ష స్తంభము లేదా ఆకాశ స్తంభము లేదా వేలాడే స్తంభము గల వాస్తు అద్భుతము ఇక్కడ స్తంభాలలో ఒకటి. నేల అనుకోకుండా నిలిచి ఉండేలా నిర్మించారు. ఈ స్తంభము కింద నుంచి మనము ఒక కండువాను అతి సులువుగా తీయవచ్చు. దీనిని ఆకాశ స్తంభము అని అంటారు. ఇలాంటిది ఇంకొకటి కూడా ఉండేదంట. ఒక ఆంగ్లేయ అధికారి దీనిని ఎలా నిర్మించారని చూడడానికై దానిని ఎత్తి చూడడానికి ప్రయత్నించినప్పుడు ఆలయము ముఖమండపంపై కప్పు పక్కకు ఒలికిపోయిందని చెబుతారు. ఇప్పటికీ అది అలాగే ఉంది. దానిని ఎలా సరిచేయాలో నేలకు ఆనని తిరిగి ఎప్పటి వలె ఎలా నిలపాలో ఎవరికీ అర్థము కాలేదు. సాధారణంగా ఏ మండపంలో అయినా అందులో ఉన్న స్తంభాలన్నీ కింద భాగాన అలాగే పై భాగాన సమాన ద్వారములో ఉండి పైకప్పు ఒక్క బరువును సమానంగా మోస్తూ ఉంటాయి. కానీ ఈ మండపములో మూడు స్తంభాలు ఒక గుంపుగా ఉంటాయి. ప్రతి గుంపులో ఉన్న మూడు స్తంభాలు క్రింది భాగాన అంటే నేల మీద ఒకదానితో ఒకటి మీటరు దూరము లో ఉంటాయి. కానీ, పైభాగాన మూడు స్తంభాల తలభాగాలు ఒకదానితో ఒకటి ఆనుకొని ఉంటాయి. అంటే ప్రతి స్తంభము నిట్ట నిలువుగా కాక కొంచెము ఏకవాలుగా నిలబడి ఉంటాయి. అయినా బండరాళ్లతో నిర్మించబడిన పైకప్పు వందల సంవత్సరాలు అయినా చెక్కుచెదరకుండా నేటికీ నిలిచే ఉంది.
ఈ ఆలయము లో కనిపించే రంగు రంగుల చిత్రాలలో అప్పటి ప్రజల అలవాట్లు, వస్తువులు, నగలు, తల వెంట్రుకలను అందంగా కొప్పు పెట్టుకునే రీతిలో కనిపిస్తాయి. లేపాక్షి చిత్రాలలో కనిపించని తలకట్టు నగకట్టు ఉండదని ప్రతీది. ఇక్కడ దేవాలయపు పైకప్పు భాగము అందు మార్కండేయ చరిత్ర, గంగా అవతారణ, త్రిపురాసర సంహారము, వటపర్తి సాయి మొదలైన రంగుల చిత్రాలు నేటికీ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు వచ్చి పాల్గొంటారు. ఈ ఉత్సవాలలో దుర్గామాతను, శ్రీరామచంద్రమూర్తిని నైనానందకరంగా అలంకరించి ఊరేగిస్తారు. పాప నాస్వేశ్వర స్వామి వారి ఉత్సవాలు పది రోజులు పాటు నిర్వర్తిస్తారు. ప్రతి ఒక్కరు చూడవలసిన గొప్ప ప్రదేశము వీరభద్రస్వామి దేవాలయము.